గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం.. పంచాయతీలకు అదనపు ఆదాయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను వినియోగించి ఈవీ చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, పంచాయతీలకు అదనపు ఆదాయ వనరులను సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రధానంగా పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో ఈ సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించి పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా, వాటిని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ కార్యక్రమం అమలుతో గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడే అవకాశం ఉంది.

