‘scigovinjudicial.com’ పేరుతో మోసపూరిత వెబ్సైట్.. వ్యక్తిగత, ఆర్థిక వివరాలు వెల్లడించవద్దని ప్రజలకు సూచన
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నకిలీ వెబ్‌సైట్‌పై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప్రజలను అప్రమత్తం చేసింది. సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా రూపొందించిన ‘scigovinjudicial.com’ అనే వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
ఈ నకిలీ వెబ్‌సైట్‌ను సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌గా భావించి ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అందించవద్దని రిజిస్ట్రీ సూచించింది.
సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ https://www.sci.gov.in/ మాత్రమేనని స్పష్టం చేసింది. న్యాయస్థానం పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులు, సందేశాలు, వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
ఏదైనా సమాచారం అందించే ముందు సంబంధిత వెబ్సైట్ అధికారికమైనదా కాదా అని నిర్ధారించుకోవాలని, అనుమానాస్పద వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను నమోదు చేయవద్దని హెచ్చరించింది.
సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ, న్యాయస్థానాల పేర్లను ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సూచించింది.
