పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు
అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి.. మధుసూదనాచారి పిలుపు
వరంగల్, నవంబర్ 3: వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి వరంగల్‌లో పర్యటించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఏవీవీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, లాల్ బహదూర్ కళాశాలల్లో సిబ్బంది, పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించి ఓటరు నమోదు ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు నవంబర్ 6 చివరి తేదీ అని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమ ప్రాంతాల్లోని అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు.
అవసరమైన పత్రాలతో వెంటనే నమోదు చేసుకోవాలి
ఓటరు నమోదుకు పట్టభద్రతకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఫొటో, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు అవసరమని తెలిపారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యమైన పత్రాలను సమర్పించి ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
ఓటరు జాబితాలో పేర్లు నిరంతరం కొనసాగాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు విధానంపై మధుసూదనాచారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి అర్హత సాధించి ఓటరుగా నమోదైన వారి పేర్లు నిరంతరం ఓటరు జాబితాలో కొనసాగించే విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. కొత్తగా అర్హత పొందిన పట్టభద్రుల పేర్లను చేర్చడం, మరణించిన వారి పేర్లను తొలగించడం ద్వారా జాబితాను నిరంతరం నవీకరించాలని సూచించారు.
ప్రతి సంవత్సరం మళ్లీ నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా విధానపరమైన మార్పులు తీసుకురావాలని, ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి సమగ్ర ప్రాతినిధ్యం సమర్పిస్తానని తెలిపారు. దేశవ్యాప్తంగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉందని, ఎన్నికల సంఘం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
శాసనమండలి పునరుద్ధరణకు చారిత్రక నేపథ్యం
శాసనమండలి పునరుద్ధరణకు సంబంధించిన చారిత్రక అంశాలను కూడా మధుసూదనాచారి ప్రస్తావించారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దయిందని, అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మండలి పునరుద్ధరణకు చర్యలు ప్రారంభమయ్యాయని వివరించారు.
ఈ ప్రక్రియలో పార్లమెంట్ స్థాయిలో అంశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమకు అప్పగించారని, తమ ప్రయత్నాల ఫలితంగా 2007లో బిల్లు ఆమోదం పొందగా, 2008లో శాసనమండలి పునరుద్ధరించబడిందని గుర్తుచేశారు.
శాసనమండలి ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే కీలక వేదిక అని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టభద్రులు తమ మేధస్సు, అనుభవం, సామాజిక బాధ్యతతో శాసన ప్రక్రియలో భాగస్వాములు కావడానికి పట్టభద్రుల నియోజకవర్గం అవకాశం కల్పిస్తుందని తెలిపారు.
ప్రతి పట్టభద్రుడు బాధ్యతగా నమోదు చేసుకోవాలి
“ముందుగా మనం మన పేర్లు నమోదు చేసుకుందాం. ఆ తర్వాత మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడిని నమోదు చేయిద్దాం. ఒక్క అర్హత ఉన్న పట్టభద్రుడి పేరు కూడా నమోదు కాకుండా మిగలకుండా మనమంతా బాధ్యతగా పనిచేద్దాం” అని మధుసూదనాచారి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ కుడా చైర్మన్ కుడా యాదవరెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజు గణేశ్, రమేష్, మసూద్, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
