హైదరాబాద్: అవినీతిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతుందని, అవినీతిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగిస్తామని ఏసీబీ డీజీ చారుసిన్హా స్పష్టం చేశారు.
ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2026 వరకు తెలంగాణ ఏసీబీ 10 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు, 34 ట్రాప్ కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది. 1983లో ఏసీబీ ఏర్పాటైన తర్వాత ఒకే త్రైమాసికంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ నేపథ్యంలో ఏసీబీ డీజీ చారుసిన్హా అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో నమోదైన కేసులు, ట్రాప్ ఆపరేషన్లు, దర్యాప్తు పురోగతి, నిందితులపై తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా చారుసిన్హా మాట్లాడుతూ, అధికారుల సమష్టి కృషి, నిబద్ధత వల్లే ఈ రికార్డు సాధ్యమైందన్నారు. అవినీతిపై ఏమాత్రం రాజీ పడకుండా మరింత వేగంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తులు కొనసాగించాలని అన్ని యూనిట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నిజాయితీ, ప్రజాసేవే ఏసీబీ ప్రధాన లక్ష్యమని, అవినీతి నిర్మూలన కోసం ఇదే దూకుడు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
