ఖమ్మం గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన ప్రవేశ మార్గంగా మారుతోందని డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి రవాణాను సమర్థవంతంగా అరికట్టేందుకు జిల్లాలోని ప్రధాన ప్రవేశ మార్గాలు, సరిహద్దు ప్రాంతాలు, అనుమానాస్పద రవాణా మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. గంజాయి అక్రమ రవాణా జరిగే మార్గాలను గుర్తించి, పటిష్టమైన తనిఖీలు చేపట్టడం ద్వారా మాదకద్రవ్యాల రవాణాను నియంత్రించవచ్చని తెలిపారు.
నేర కేసుల దర్యాప్తు సమగ్రంగా, పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలని డీజీపీ ఆదేశించారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పక్కా ఆధారాలను సేకరించి, నేరస్థులకు న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా తీవ్రమైన నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, డిజిటల్ ఆధారాలు, డేటా విశ్లేషణ, ఇతర ఆధునిక సాంకేతిక సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించాలని పోలీసు అధికారులకు సూచించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నేరాల నియంత్రణ, సమర్థవంతమైన దర్యాప్తు, సాంకేతిక వినియోగం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించాలని అధికారులను ఆదేశించారు
