శంషాబాద్‌లో హృదయ విదారక ఘటన.. రోడ్డుపై పసికందును వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. రాళ్లగూడ ఇంద్రనగర్ రాజీవ్ గృహ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రోడ్డుపై నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పసికందును గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని శిశువును సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానికుల అప్రమత్తతతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పసికందును అక్కడ వదిలేసిన వారెవరో గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనాస్థల పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ కీలక ఆధారాల కోసం గాలిస్తున్నారు.
పసికందును ఎవరు, ఎందుకు రోడ్డుపై వదిలి వెళ్లారనే కోణంలో పోలీసులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను కలచివేయగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
