ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో కీలక విషయాలను వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్
70 సీసీ కెమెరాల పరిశీలన.. 80 మంది అనుమానితుల విచారణ.. చివరకు ‘బాబు’ అనే పదంతో నిందితుల గుర్తింపు
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, సుమారు 80 మంది అనుమానితులను విచారించిన అనంతరం.. చివరకు ‘బాబు’ అనే ఒక్క పదం ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా.. రూపారెడ్డి పాఠశాల విద్యార్థులను సాధారణంగా ‘బాబు’ అని పిలిచే విషయాన్ని గుర్తించారు. హత్యకు ముందు ఆమె తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో కూడా ‘బాబు’ అని సంబోధించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంశాన్ని కీలక ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేయడంతో హత్య వెనుక ఉన్న ఇద్దరు విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
ఈజీ మనీ కోసం నేరం వైపు..
పోలీసుల వివరాల ప్రకారం.. హాస్టల్లో ఉంటున్న ఇద్దరు విద్యార్థులు చెడు వ్యసనాలకు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలకు అలవాటు పడ్డారు. హాస్టల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలకు సంబంధించిన వీడియోలను చూస్తుండేవారని ఎస్పీ తెలిపారు.
ఒక సందర్భంలో ఆ విద్యార్థులు డబ్బులతో ప్రిన్సిపాల్ రూపారెడ్డికి పట్టుబడ్డారని, అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి రూపారెడ్డిపై ఇద్దరు విద్యార్థులు కక్ష పెంచుకున్నారని, ఆమెను హత్య చేసి డబ్బులు దోచుకోవాలని ప్రణాళిక వేసుకున్నారని ఎస్పీ వివరించారు.
ముందుగానే కత్తి, గ్లౌజులు, మాస్కులు కొనుగోలు
హత్యకు ముందే నిందితులు కొండమల్లెపల్లిలో కత్తి, గ్లౌజులు, మాస్కులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆగస్టు 11న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఒక విద్యార్థి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించగా.. మరో విద్యార్థి బయట కాపలాగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
రూపారెడ్డి ఇంటికి చేరుకున్న సమయంలో ఆమెపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం 27 సార్లు కత్తితో దాడి చేసి హత్య చేసిన అనంతరం.. ఇంట్లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదు, ఐఫోన్‌ను తీసుకుని ఇద్దరూ అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.
ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం
హత్య అనంతరం నిందితులు ఉపయోగించిన గ్లౌజులు, కత్తి, తమ దుస్తులను చెట్ల పొదల్లో పడేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అనంతరం దొంగిలించిన డబ్బుతో పాఠశాలకు వెళ్లకుండా జల్సాలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ప్రయాణంలోనే అరెస్ట్
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. పెండ్లిపాకల నుంచి మల్లేపల్లికి వస్తున్న సమయంలో ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
వారి వద్ద పెద్ద మొత్తంలో నగదు లభించిందని.. అందులో మూడు నోట్లపై రక్తపు మరకలు గుర్తించినట్లు వెల్లడించారు. విచారణలో తామే రూపారెడ్డిని హత్య చేసినట్లు ఇద్దరు విద్యార్థులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు.
నిందితుల నుంచి రూ.1.56 లక్షల నగదు, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.
‘బాబు’ అనే సాధారణంగా వినిపించే పదాన్ని కీలక ఆధారంగా మార్చుకుని, సీసీ కెమెరాలు, అనుమానితుల విచారణ, సాంకేతిక ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించడం ఈ హత్య కేసులో కీలకంగా మారింది.
