హాస్టళ్లు, పీజీల్లో మహిళల భద్రతకు భరోసా!
ప్రాజెక్ట్ సేఫ్ స్టేకు శ్రీకారం.. హాస్టళ్లు, పీజీల నమోదు ఇక తప్పనిసరి
యాజమాన్యాలతో భేటీ అయిన హైదరాబాద్ సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్
ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక అడుగు వేసింది. వారికి మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థలతో కలిసి సంయుక్తంగా ప్రాజెక్ట్ సేఫ్ స్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి దశ కింద రూపొందించిన సురక్ష నివాస్ 1.O మార్గదర్శకాల బ్రోచర్‌ను బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం కమిషనరేట్ పరిధిలోని హాస్టళ్లు, పీజీల నిర్వహణ, మహిళా భద్రతపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వారు పాల్గొని నిర్వాహకులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. నగర పరిధిలోని ప్రతి మహిళా హాస్టల్, పీజీ నిర్వాహకులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. మహిళల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు నూతనంగా అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కింద నిర్దేశిత ఫామ్-ఏ ను పూర్తి చేసి స్థానిక పోలీసులకు సమర్పించాలన్నారు. వసతి గృహాల్లో భద్రతా ప్రమాణాలపై తాము నిర్వహించిన సర్వేలో కొన్ని లోపాలు వెలుగు చూశాయని తెలిపారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలతో నగర పరిధిలోని 447 మహిళా హాస్టళ్లలో క్షేత్రస్థాయి పరిశీలన జరపగా.. దాదాపు 97.5 శాతం హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, కేవలం 43 శాతం వసతి గృహాలకు మాత్రమే సరైన కాంపౌండ్ వాల్స్ ఉన్నట్లు తేలిందన్నారు. అలాగే అత్యంత కీలకమైన అగ్నిమాపక పరికరాలు కేవలం 38.9 శాతం హాస్టళ్లలోనే అందుబాటులో ఉన్నాయని అన్నారు.
ఈ విభాగాల్లో తక్షణమే మార్పులు రావాల్సిన అవసరం ఉందని, భద్రతా లోపాలను సవరించడమే లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఈ నియమ నిబంధనలు హాస్టల్ యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడానికి లేదా అదనపు ఆంక్షలు విధించడానికి ఉద్దేశించినవి కావని, కనీస భద్రతా ప్రమాణాలను నెలకొల్పి మహిళలకు జవాబుదారీతనంతో కూడిన రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. త్వరలోనే హాస్టళ్లలో మహిళా భద్రతకై ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని, భవిష్యత్తులోనూ పోలీసులు వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్వాహకులకు తగిన మార్గదర్శకత్వం అందిస్తారని వెల్లడించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ… హాస్టళ్ల నిర్వాహకులు చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నివాసితులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నివాస ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు అపార్ట్మెంట్లను అద్దెకు ఇవ్వడం వ్యక్తిగత అద్దె (టెనెన్సీ) పరిధిలోకి వస్తుందని, కానీ పెద్ద ఎత్తున భవనాలను సమూహంగా తీసుకుని హాస్టల్ రూపంలో నడపడం కచ్చితంగా ‘వ్యాపారం’ (ట్రేడ్) కిందికే వస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులందరూ వెంటనే మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, దీని ఆధారంగానే అగ్నిమాపక భద్రతతో పాటు మిగిలిన భద్రతా ప్రమాణాల అమలు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హాస్టళ్లలో భోజనం, వసతి సదుపాయాలు కల్పించే వారు చట్టప్రకారం కచ్చితంగా ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో వాటిని అనధికారిక వసతి గృహాలుగానే పరిగణిస్తామని హెచ్చరించారు.
పోలీస్ నిబంధనల ప్రకారం హాస్టల్‌కు వచ్చే, వెళ్లే వారి పూర్తి వివరాలతో కూడిన పక్కా రిజిస్ట్రేషన్ల నిర్వహణ తప్పనిసరి అని పేర్కొన్నారు. హాస్టళ్లలో పనిచేసే సేవకులు, క్లీనర్లు, ఇతర సేవా సిబ్బంది అందరికీ కచ్చితంగా సెక్యూరిటీ చెకప్ నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. వసతి గృహాల్లో కేవలం సీసీటీవీ కెమెరాల సంఖ్య పెంచడం ముఖ్యం కాదని, అవి ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయనేదే ప్రధానమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాంతాల్లో (కామన్ ఏరియాస్) అమర్చిన కెమెరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ, అవి నిరంతరాయంగా రికార్డు అయ్యేలా చూసుకోవాలని నిర్వాహకులకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టి. వెంకన్న మాట్లాడుతూ… హాస్టళ్లలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అత్యవసర రక్షణ చర్యలను వివరించారు. భవనం ఎన్ని అంతస్తులు ఉన్నప్పటికీ అత్యవసర సమయాల్లో నివాసితులు సురక్షితంగా బయటపడటానికి కచ్చితంగా రెండవ మెట్ల మార్గం ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి అంతస్తులోనూ, ప్రతి గదిలోనూ కనీసం రెండు కేజీల సామర్థ్యం గల చిన్నపాటి ఫైర్ ఎక్స్‌టింగిషర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భవనం పైభాగంలో ఉండే వాటర్ ట్యాంక్‌కు చిన్న మోటారును అనుసంధానించి హోస్ రీల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే ప్రమాదం జరిగిన ప్రాథమిక దశలోనే మంటలను అదుపు చేయవచ్చన్నారు.
హాస్టళ్లలో నివసించే వారి ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన ఆహార సరఫరా ఎంతో కీలకమని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పి. మూర్తి పేర్కొన్నారు. వంటగది పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బొద్దింకలు, ఇతర కీటకాలు లేకుండా క్రమం తప్పకుండా పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలని సూచించారు. ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఆహార నమూనాలను సేకరించి అన్‌సేఫ్, సబ్‌స్టాండర్డ్, మిస్‌బ్రాండెడ్ కేటగిరీల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… నగరంలో హాస్టళ్ల నిర్వహణ వ్యాపారం కాదని, ఒక బాధ్యతాయుతమైన సేవ అని అన్నారు. వసతి గృహాల్లో భద్రతా ప్రమాణాలను పెంచి, ఆన్లైన్ సేఫ్టీ రేటింగ్స్ సాధించడం ద్వారా నిర్వాహకుల బ్రాండ్ విలువ పెరుగుతుందని, తద్వారా భవిష్యత్తులో మరింత క్రెడిబిలిటీ పెరుగుతుందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ శ్రీ పి.ఉదయ్ కుమార్, ఐఏఎస్, అదనపు సీపీ(క్రైమ్స్) శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్, అదనపు సీపీ(లా అండ్ ఆర్డర్-సౌత్ రేంజ్) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీ మూర్తి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీ వెంకన్న, డీసీపీలు హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ శ్రీ శేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఖ్యాతి నరవణే, డీసీపీలు శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్, శ్రీమతి శిల్పవల్లి, ఐపీఎస్, శ్రీ చైతన్యకుమార్, ఐపీఎస్, శ్రీ రమణారెడ్డి, శ్రీమతి డాక్టర్ లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
