శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్.. దర్శనానికి వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి!
2026-27 మండల-మకరవిలక్కు యాత్రకు ముందస్తు స్లాట్ బుకింగ్.. రోజుకు 80 వేల మంది భక్తులకు దర్శన అవకాశం
శబరిమల: అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచన. 2026-27 మండల-మకరవిలక్కు యాత్రా సీజన్ నేపథ్యంలో శబరిమలలో దర్శనం కోసం ముందస్తు ఆన్లైన్ వర్చువల్ క్యూ (Virtual Q) బుకింగ్ తప్పనిసరి అని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. భక్తుల రద్దీని నియంత్రించడం, సురక్షితంగా దర్శనం కల్పించడం లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేశారు. రోజుకు మొత్తం 80 వేల మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు.
ఆన్లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?
భక్తులు అధికారిక వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా దర్శన స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్సైట్: https://sabarimalaonline.org/
- రిజిస్ట్రేషన్: వెబ్సైట్లో ఖాతా తెరిచి లాగిన్ కావాలి.
- వివరాల నమోదు: భక్తుల వివరాలు, అవసరమైన గుర్తింపు పత్రాల సమాచారాన్ని నమోదు చేయాలి.
- స్లాట్ ఎంపిక: అందుబాటులో ఉన్న దర్శన తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి.
- పాస్ డౌన్లోడ్: బుకింగ్ పూర్తయిన తర్వాత వర్చువల్ క్యూ పాస్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
వర్చువల్ క్యూ బుకింగ్ ఉచితం. బుకింగ్ కోసం అనధికారిక వెబ్సైట్లు లేదా మధ్యవర్తులకు డబ్బులు చెల్లించవద్దని భక్తులు జాగ్రత్తగా ఉండాలి.
భక్తులు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
దర్శనానికి వెళ్లేటప్పుడు బుకింగ్ సమయంలో సమర్పించిన గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. బుకింగ్‌లో పేర్కొన్న వివరాలు, గుర్తింపు పత్రంలోని వివరాలు సరిపోలేలా చూసుకోవాలి. స్లాట్లు పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున యాత్రకు ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది.
భక్తుల కోసం కొత్త ‘శబరి పోర్టల్’
శబరిమల యాత్రికులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందించేందుకు పథనంతిట్ట జిల్లా యంత్రాంగం ‘శబరి పోర్టల్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ద్వారా వర్చువల్ క్యూ బుకింగ్ లింకులు, పూజల సమయాలు, రవాణా వివరాలు, వైద్య సదుపాయాలు, పార్కింగ్ ప్రాంతాలు, మార్గ పటాలు, అత్యవసర ఫోన్ నంబర్లను తెలుసుకోవచ్చు.
వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా సమాచారం
భక్తులకు సహాయం అందించేందుకు వాట్సాప్ చాట్‌బాట్ సేవను కూడా ప్రారంభించారు. ప్రయాణ మార్గాలు, బస్సు, రైలు సమయాలు, వైద్య సేవలు, అత్యవసర సహాయం వంటి వివరాలను తెలుసుకోవడానికి ఈ డిజిటల్ సేవ ఉపయోగపడుతుంది.
అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరే ముందు అధికారిక వెబ్సైట్లో తాజా మార్గదర్శకాలు, అందుబాటులో ఉన్న స్లాట్లు, యాత్రా నిబంధనలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
— పద్మప్రభ న్యూస్
