నేటి నుంచి శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభం
నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు.. అభిషేకాలు, దర్శనాలపై ఆలయ అధికారుల కీలక నిర్ణయాలు
శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో నేటి నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెలరోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కార్తిక మాసోత్సవాల నేపథ్యంలో నెలరోజుల పాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన విధానంలో మార్పులు చేశారు. శని, ఆదివారాలు, సోమవారాల్లో స్వామివారికి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
కార్తిక మాసంలో శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శన ఏర్పాట్లు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
— పద్మప్రభ న్యూస్

