బంగ్లాదేశ్ మహిళ అరెస్ట్.. సహజీవన భాగస్వామి కూడా పోలీసుల అదుపులో
హైదరాబాద్: నకిలీ ఆధార్, పాన్ కార్డులతో భారతీయురాలిగా చలామణి అవుతూ హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మహిళను ఈగల్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ‘ఆల్ఫా’ (పేరు మార్చారు)గా పేర్కొన్న మహిళ జియా శ్యాంరావు పేరుతో నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి, అదే పేరుతో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా తెరిచినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
టూరిస్ట్ వీసాపై వచ్చి.. అక్రమ కార్యకలాపాల్లోకి
2021 డిసెంబర్లో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిన ఆమె, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వ్యభిచార కార్యకలాపాల్లోకి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. నూర్ అనే వ్యక్తి ప్రలోభపెట్టగా, రాహుల్, జే, జేకే అనే బ్రోకర్ల ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కార్యకలాపాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నెలకు సుమారు రూ.75 వేల వరకు సంపాదించినట్లు సమాచారం.
సహజీవన భాగస్వామితో పరిచయం
2021లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్యాంరావుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2022 నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం అతని భార్యకు తెలియడంతో వారి మధ్య దూరం పెరిగినట్లు దర్యాప్తులో పేర్కొన్నారు. అనంతరం శ్యాంరావు బంగ్లాదేశ్‌కు వెళ్లి ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులను కలిసినట్లు సమాచారం.
డ్రగ్స్ వినియోగం నుంచి విక్రయాల వరకు..
కస్టమర్ల ద్వారా సింథటిక్ డ్రగ్స్‌కు అలవాటు పడిన ఆల్ఫా, గోవాకు చెందిన ఆకాష్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డెడ్‌డ్రాప్ పద్ధతిలో గోవా, హైదరాబాద్‌లోని నిర్ణీత ప్రాంతాల్లో డ్రగ్స్ ఉంచి సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం తన కస్టమర్లు, పరిచయస్తులకు కూడా డ్రగ్స్ విక్రయించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. శ్యాంరావు కూడా డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు.
పోచమ్మ బస్తీలో పోలీసుల దాడి
గోవా నుంచి డ్రగ్స్‌తో హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం అందడంతో ఈగల్ ఫోర్స్, సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా షేక్‌పేట పోచమ్మ బస్తీలోని నివాసంపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో ఒక గ్రాము సింథటిక్ డ్రగ్స్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఆల్ఫాతో పాటు ఆమె సహజీవన భాగస్వామి శ్యాంరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 1261/2026 కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్ సరఫరాదారుడిగా అనుమానిస్తున్న గోవాకు చెందిన ఆకాష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
డ్రగ్స్ సమాచారం తెలిస్తే తెలియజేయండి
విదేశాల నుంచి వచ్చిన యువతులను ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్రమ కార్యకలాపాల్లోకి దింపుతున్న బ్రోకర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఫోర్స్ హెచ్చరించింది. డ్రగ్స్ సరఫరా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్ నంబర్ 87126 71111కు తెలియజేయాలని సూచించింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
— పద్మప్రభ న్యూస్
