చేనేత కార్మికుల ప్రస్తుత పరిస్థితులు – జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ విశిష్టతపై
విస్తృత క్షేత్ర పర్యటన
వరంగల్ జిల్లా కొత్తవాడ గ్రామం ఒకప్పుడు చేనేత కళాకారుల ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ముఖ్యంగా కొత్తవాడ ధరిస్ తయారీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. పూర్వకాలంలో ఇక్కడ తయారైన ధరిస్ దేశంలోని అనేక రాష్ట్రాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయబడేవి. ఇంగ్లాండ్ మ్యూజియంలో కొత్తవాడ ధరిస్ సంరక్షించబడటం ఈ గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపునకు నిదర్శనం. ఈ చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవడం మరియు చేనేత కార్మికుల ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం పింగిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వడ్డేపల్లి బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థినులు 50 మంది క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి మరియు కన్వీనర్ డాక్టర్ రాజు గుగులోత్ పాల్గొని విద్యార్థినులను ప్రోత్సహించారు.
పర్యటన సందర్భంగా టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత విద్యార్థినులకు చేనేత రంగంలోని వాస్తవ పరిస్థితులను వివరించారు. ఒకప్పుడు గ్రామంలో ప్రతి ఇంట్లో మగ్గం శబ్దం వినిపించేదని, వందలాది కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవించేవని తెలిపారు. అయితే కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు మారడం, పవర్లూమ్ మరియు యంత్రాలతో తయారయ్యే వస్త్రాల పెరుగుదల, ముడి సరుకుల ధరల పెరుగుదల వంటి కారణాల వల్ల చేనేత రంగం క్షీణించిందని చెప్పారు. ప్రస్తుతం ఒక దరిని తయారు చేయడానికి అనేక రోజులు కష్టపడాల్సి వస్తున్నా, అందుకు లభించే పారితోషికం తగిన స్థాయిలో లేకపోవడం కార్మికుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోందని వెల్లడించారు. మధ్యవర్తుల ఆధిపత్యం వల్ల నేరుగా మార్కెట్ లాభాలు కార్మికులకు చేరడం లేదని కూడా పేర్కొన్నారు.
జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ ప్రాముఖ్యతపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది. GI ట్యాగ్ అనేది ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆ ఉత్పత్తి అసలుదనాన్ని కాపాడే విధానం. కొత్తవాడ ధరిస్కు GI ట్యాగ్ లభిస్తే మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పెరుగుతుందని, నకిలీ ఉత్పత్తుల నుండి రక్షణ లభిస్తుందని, అంతర్జాతీయ స్థాయిలో మంచి ధర పొందే అవకాశం ఉంటుందని వివరించారు. అయితే GI ట్యాగ్ ఉన్నప్పటికీ, దాని ప్రయోజనాలు పూర్తిస్థాయిలో కార్మికులకు చేరాలంటే సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలు, ప్రభుత్వ మద్దతు మరియు అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ అవి సరిపడా స్థాయిలో అమలు కావడం లేదని కార్మికులు తెలిపారు. రుణ సౌకర్యాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ సహాయం వంటి అంశాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆధునిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ విక్రయాలు, డిజిటల్ ప్రమోషన్, బ్రాండింగ్ వంటి చర్యలు తీసుకుంటే చేనేత ఉత్పత్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయని నిపుణులు సూచించారు. యువత ఈ వృత్తిలోకి రావడం తగ్గిపోవడం కూడా రంగం క్షీణతకు ఒక ప్రధాన కారణమని తెలిపారు.
కొత్తవాడ గ్రామం జంపకానల తయారీలో కూడా ప్రసిద్ధి చెందింది. కానీ ప్రస్తుతం ఈ సంప్రదాయ వృత్తి కనుమరుగవుతున్న పరిస్థితిలో ఉంది. తక్కువ ఆదాయం, పెరిగిన పోటీ, ఆధునిక వృత్తుల వైపు మొగ్గు చూపడం వంటి కారణాల వల్ల ఈ కళ కొనసాగించేవారు తగ్గిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో సరైన ప్రోత్సాహం మరియు మార్కెట్ అవకాశాలు కల్పిస్తే చేనేత రంగం మళ్లీ పునరుజ్జీవనం పొందే అవకాశం ఉందని విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. ఈ క్షేత్ర పర్యటన వారికి సామాజిక అవగాహనను పెంపొందించడమే కాకుండా స్థానిక కళలను కాపాడాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేసింది.
