వరంగల్లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం
150 మందికి పైగా దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, వీల్ చైర్లు, ట్రై సైకిళ్ల పంపిణీ
వరంగల్ నగరంలోని ఎంవీ కాలనీ, కొత్తవాడలో ఉన్న పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో, పరికిపండ్ల నరహరి IAS గారు స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, భగవాన్ మహావీర్ ట్రస్ట్ – హైదరాబాద్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, “దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అందించడం కేవలం ఒక సహాయం కాదు, వారి జీవితాల్లో తిరిగి నడిచే ధైర్యాన్ని, స్వావలంబనను నింపడమే” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ గారు పాల్గొని శిబిరాన్ని సందర్శించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, కొలతల ప్రక్రియను, కృత్రిమ కాళ్ల అమరికను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆలయ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
ఈ శిబిరానికి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో దివ్యాంగులు హాజరయ్యారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్రమమైన నిర్వహణతో రిసీవ్ చేసి, నిపుణులచే శరీర కొలతలు తీసుకుని అదే రోజున కృత్రిమ కాళ్లు అమర్చడం ఈ శిబిరంలోని ప్రత్యేకతగా నిలిచింది. డిసెంబర్ 27వ తేదీన మాత్రమే సుమారు 150 మందికి పైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు అందజేయగా, అవసరాన్ని బట్టి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు కూడా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి, IAS గారు మాట్లాడుతూ —
“సమాజంలో దివ్యాంగులు దయపై ఆధారపడే వ్యక్తులు కారు. సరైన సహాయం, అవకాశాలు అందితే వారు కూడా గౌరవంగా, స్వావలంబనతో జీవించగలరు. ఈ శిబిరం ద్వారా మేము వారికి ఒక పరికరం మాత్రమే ఇవ్వడం కాదు, వారి జీవితాల్లో తిరిగి నిలబడే నమ్మకాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆలయ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సేవలు అందిస్తూ, సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తి వరకు సహాయం చేరాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం” అని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిబిరంలో మహావీర్ ట్రస్ట్ బాధ్యులు ఇంద్రజన్, ఆలయ ఫౌండేషన్ సీఈవో రమేష్ బాబు, అడిషనల్ సీఈఓ రాజేంద్రకుమార్, కీర్తి నాగార్జున, వరంగల్ ఇంచార్జి పరికిపండ్ల వేణు, కుసుమ సతీష్, వన్నాల వెంకటరమణ, చిప్ప వెంకటేశ్వర్లు నేత, గాజుల సంపత్, బొజ్జపల్లి సుభాష్, మంత్రి లింగమూర్తి ఎలగం చిన్న కొమురయ్య, బేతి అశోక్, దామెర రాజ్ కమల్, ముండ్రాతి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ లు ఆడెపు స్వప్న, బసవరాజ్ కుమారస్వామి, గుండేటి నరేంద్ర కుమార్, జన అధికార సమితి అధ్యక్షులు చేరాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
