మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఇప్పటివరకు ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 142 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. అలాగే చేపట్టిన విస్తృత తనిఖీల్లో రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీజీపీ వివరించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.
ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
