పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ కాజీపేట పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం కాజీపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి పూలమొక్కను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ తో పాటు కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సిసిటిఎన్ఎస్ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండిరగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు,కేడీ,డిసిలు, మిస్సింగ్, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’’ అని సీపీ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా,కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, కాజీపేట ఎస్.ఐలు నవీన్‌కుమార్,లవణ్‌కుమార్,శివ పాల్గోన్నారు.
