ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్ ప్రసిద్ధి చెందారు. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. అయితే, బీవీ పట్టాభిరామ్ భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరుంది. ఇక, ఖైరతాబాద్‌లోని స్వగృహంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. బుధవారం నాడు ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
అయితే, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన “రావ్ సాహెబ్” భావరాజు సత్యనారాయణ సంతానంలోని 15 మందిలో బీవీ పట్టాభిరామ్ ఒకరు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యను నేర్చుకుని.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ సాధన చేసి.. 1970 దశకం నాటికి ఇండిపెండెంట్ గా రెండుమూడు గంటల పాటు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి బీవీ పట్టాభిరామ్ ఎదిగారు.
