తెలంగాణలో పెరుగుతున్న మద్యం దుకాణాలపై హైకోర్టు సీరియస్!
ఇలాగే కొనసాగితే తెలంగాణ పేరు మార్చాల్సి వస్తుంది: హైకోర్టు! హైదరాబాద్:నవంబర్ 26
తెలంగాణ హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఇదే వేగంతో మద్యం దుకాణాల సంఖ్య పెరిగితే.. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
అయితే రాష్ట్రంలో మద్యం వినియోగం, దుకాణాల సంఖ్య విషయంలో హైకోర్టు పాత్ర చాలా తక్కువ అని కోర్టు తెలిపింది. అసలింత కు కోర్టు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసింది అంటే.. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారా యణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని సూచించారు. కానీ వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కాలనీ వాసులు ఈ అంశం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రం లో ఇలా ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను పెంచుకుంటూ పోతే.. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టల్సి వస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అలానే రాష్ట్రంలో మద్యం షాపుల నియంత్రణ మీద తమకు పూర్తి అధికారాలు లేవని ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తెలిపింది. అయినప్పటికీ ఈ అంశంలో తాము విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు ఆదేశాలు జారీ చేయగలమని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రోడ్ల పైకి మద్యం షాపులు కనిపించకుండా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినా..
ప్రభుత్వం వాటిని కనీసం పట్టించుకోవడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నాగారం మున్సిపాలిటీలో జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర మున్సిపల్, ఎక్సైజ్ అధికారులతో పాటు.. షాపు ఏర్పాటు చేసిన వారికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
