హైదరాబాద్:నవంబర్10
ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్ లాలాగూడ లోని తన నివాసంలో ఆదివారం రాత్రి అస్వస్థతకు గురి కాగా దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందు తూ ఆయన ఈరోజు ఉదయం 7:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మరణంతో సాహితీ లోకం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.అందెశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభిం చారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు.
అందెశ్రీ పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పాటలతో అందెశ్రీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే.అందెశ్రీకి ముగ్గురు కుమార్తులు, కుమారుడు ఉన్నారు.
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్శిటీ నుంచి అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ లభించింది. 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం లభించింది. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది
